20 December, 2006

నా గురించి

నా గురించి నేనే ఎక్కువగా చెప్పుకోవడం అంత బాగోదు కాబట్టి కొంచెం క్లుప్తంగా చెప్తాను.
కథనంలో ఆది మధ్యాంతాలు శుభమయంగా ఉండాలని ప్రయత్నిస్తే అది నా గురించి చెప్పినట్లవట్లేదు. పుట్టుకతో భూసురుణ్ణి. పుట్టుకతొ అందరూ సూద్రులేననీ, వారి వారి గుణ కర్మలను బట్టి మాత్రమే వారి కులనిర్ణయమని కృష్ణ భగవానుడు చెప్పిన సత్యాన్ని నేను త్రికరణశుద్ధిగా నమ్మినప్పటికీ ప్రస్తుతానికి దీన్ని ఖండించకుండా కొనసాగుదాం. శాస్త్ర రిత్యా ఆలస్యంగా ఉపనయనమైనప్పటికీ నాకు నిత్యకర్మల మీద ఉన్న అవగాహన దృష్ట్యా మా వాళ్ళు చాలా తొందరగా చేశారనే చెప్పాలి. ఆలోచనలన్నీ- త్రికాల సంధ్య, శ్రీవిద్యోపాసన స్థాయిలో ఉంటాయి. తీరా పరిస్థితి చూస్తే సంకల్పం సైతం మర్చిపోయే అంత అరుదుగా సంధ్యావందనమాయె. సూర్య భగవానుడు ఎక్కువగా కనపడని ఈ సాల్మల ద్వీపం భరత ఖండం వలె కర్మ భూమి కాదన్న వాదనని అధిగమించి ఎప్పుడైనా సంధ్య వారుద్దామంటే తిథి వార నక్షత్రాలు తెలీక తంటా. ఇది చాలదన్నట్లు ప్రతీ రోజూ ఒకరిద్దరికి నా చేతి మాత్ర ద్వారా వైకుంఠ యాత్ర ఏర్పాటు చెసి మార్ట్యుర్య్ ని సందర్శించడం వృత్తి ధర్మమాయె. ఇంకొన్నాళ్ళాగితే యఙ్ఞోపవీతం తెగిపోయేలా ఉందన్న అనుమానమొచ్చినప్పుడు మాత్రమే, జీర్ణమైపొయిన పాత పుస్తకాలు తవ్వి తీసి మంత్రమేదో వెతికి, అదేనో కాదో అన్న అనుమానాన్ని మనసులోనే ఉంచేసి, అవకాశం ఎక్కువగా ఉన్న ఒకదాన్ని ఎంచి చదివి ఉపవీతం మార్చుకునే దుస్థితి కల శ్రోత్రీయ వంశోద్భవుణ్ణి. మంత్రస్థానాధిపతికి వ్యయాధిపతి స్పర్శ ఉన్న జాతకమాయె! ఇంతకన్నా అద్భుతంగా ఎలా ఉంటుంది అని నాకు నేనే సరిపెట్టుకుంటాను.

సరే ఇక చదువు విషయానికి వస్తే చెప్పేందుకు చాలా ఉంది. ఎప్పుడూ పరీక్షలు తప్పుతూ, అప్పుడప్పుడూ పొరపాటున పాస్ అవుతూ గడచిందట నా చిన్నతనం. మా అమ్మ నోముల ఫలము, మా నాన్న అదృష్టము కలిసి కట్టుగా ప్రభావం చూపడం వల్ల ఎంసెట్లో ర్యాంక్ వచ్చి ఉన్న ఊళ్ళో ఓపెన్ కాంపెటిషన్లో మెడిసిన్ సీట్ సాధించాను. అయోమయం, బభ్రాజిమానం వంటి అనేకానేకమైన ఆశీర్వచనాలకు ఆ రోజుతో స్వస్తి. ఆ క్షణంలో అపరధన్వంతరినని, అశ్వినీ దేవతల వరప్రసాదినని కలిగిన భావన వల్ల ఎక్కిన ములగ చెట్టు విరగడానికి ఎంతో కాలం పట్టలెదు. మీకిందాక చెప్పాను నా ఆలోచనల స్థాయి. యూనివర్సిటీ గోల్డ్ మెడల్, బెస్ట్ ఔట్ గొయింగ్ స్టూడెంట్, ఇలాగన్న మాట. తీరా జరిగిందేమిటి? చావు తప్పి కన్ను లొట్ట పొయినట్లు ఒకటి రెండు పరీక్షలు గతి తప్పాయి. ఈ తరుణంలో మా అమ్మ శ్రావణ శుక్రవారాల నోము ఫలం వాడి పూర్తి చెయ్య వలసిన టైంకి డిగ్రీ పూర్తయ్యిందనిపించాను. IELTS పరీక్ష, PLAB 1 పరీక్ష వెను వెంటనే పాస్ అయ్యినప్పుడే అనుమానం వచ్చింది ఏదో తేడా వస్తోందని. అనూహ్యంగా ఇంగ్లాండ్ వచ్చి పడ్డాను. ఇక కష్టాలు మొదలు. ఏలినాటి శని ప్రభావం వల్లనె ఇలా జరిగిందన్న ఒక వాదన ఉన్నప్పటికిన్నీ నా ఉద్దెశంలొ మా అమ్మకి మిగిలిన నోము ఫలమంతా ఇంగ్లాండ్ వచ్చే వరకు వాడేసాను కాబట్టి తిరిగి ఆవిడ మరింత పుణ్యం సంపాదించే వరకూ కష్టాలు తప్పలేదు. సరి, కారణమేదైనా ప్రస్తుతానికి ఆ అంకానికి స్వస్తి చెబుదాము.

ఇక రూపు రేఖల విషయానికి వస్తే మొదటికే మోసం. అద్దంలో చూసుకున్నప్పుడు నాలోని ధన్వంతరికి కలిగే అనుమానమేమంటే క్యాన్సర్, టిబి లేదా అథమ పక్షం మాలబ్సార్ప్షన్ ఉండి ఉండాలని. గతంలో బి ఎం ఐ నార్మల్ రేంజి కన్నా తక్కువగా ఉండేది, ఇప్పుడు కనిష్ట విలువలకు పెరిగింది. మాంస భక్షణ కాకపోయినా కనీసం గుడ్డైనా తినమని, గుడ్డుని ఈ మధ్య శాకాహారంలో చేర్చారని పలువురు హితవు పలికేవారు. ఇంగ్లాండ్లో ఎంతో కాలం ఇలా మనుగడ సాగదు కాబట్టి మాంస భక్షణ ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిదని శెలవిచ్చారు. మరి కొందరైతే టన్నుల కొద్దీ నేను తిన్న కేకుల్లోని గుడ్డు శాతాన్ని కేజీలలో లెక్క కట్టి సంవత్సరంలో ఏనుగు మొండెమంత మాంసం తిన్నానని, కాబట్టి నిర్మొహమాటంగా గుడ్డు తినమని నొక్కి వక్కాణించారు. లగ్నాధిపతి అష్టమంలో ఉండడమే కాక అస్తంగతత్వంలో కూడా ఉంటే ఇక నా శరీర పుష్టి వర్ణనేల. చిన్నతనంలో నా శారీరక దారుఢ్యం చూసి కలత చెందిన నా తల్లి తండ్రులు కరాటే, కుంగ్-ఫు వంటి వాటిల్లో చేర్పించారు. చేరిన కొత్తల్లో నన్ను ఎవరైనా త్రిమూర్తుల పెర్లడిగితే బ్రూస్ లీ, జెట్ లీ మరియు జాకీ ఛాన్ అని చెప్పేవాడిని. పరశు రాముడే ఆదర్శం. కొబ్బరి చెట్టు మీద సున్నా చుట్టి కళ్ళు మూసుకుని అందులోకి కత్తి విసరడంలాంటి అనేకమైన జానపద విన్యాసాలు చేసేవాడిని. చేతికి అలవాటైన ఆ కత్తి కనబడడం మానేసినప్పటి నుండి దాన్ని నేనే గోడవతల విసిరేశానని అభియొగం మోపి, మా వాళ్ళు కొత్త కత్తి మీద చెయ్యి వెయ్యకుండా కట్టు దిట్టం చేశారు. అప్పట్లో చాలా కష్టాలు పడి, పలు ఇటుకలు విరగ్గొట్టి మరీ సంపాదించిన వేరు వేరు రంగుల కుంగ్-ఫూ బెల్ట్లు జనం నన్ను వెటకారం చెయ్యడానికి తప్ప ఎందుకూ పనికి రాలేదు. ఇది మనకు అచ్చిరాలేదని నిశ్చయించి, జన నిరొధన కన్నా చిత్త వృత్తి నిరొధన గొప్పదని ఎంచి, యోగానికి శ్రీకారం చుట్టాను. పతంజలికి తెలియని యోగ సూక్ష్మాలు పసిగట్టేద్దామన్న ఆలోచనతో, షట్చక్రాలకీ 3 నెలలు కేటాయించి మా అన్నగారితో కలసి యోగా విలేజికి బయలుదేరాను. అక్కడ కడుపు కడగడం, పేగులు కడగడం మొదలైన ప్రక్రియలు చూసి, చేసి, భయపడి అసలు అనుకున్న పని జరగడం లేదని మానేశాను. ఇక్కడ ఇంగ్లాండ్లో నీ వయసు 16 అని ఒకరు, అబ్బబ్బే అంతుండదు 12 అని ఇంకొకరు. వచ్చిన కొత్తలో జనరల్ ప్రక్టిషనర్ తో రిజిష్టర్ అవ్వాలంటే ఛెకప్ కి వెళ్ళాను. ఎప్పోయింట్మెంట్ తీసుకుని లూంజ్ లో కూర్చున్నాను. గతంలో ఇండియాలో బ్లడ్ బ్యాంక్ వాళ్ళు నా రక్త దాన ఉత్సుకతని బరువు తక్కువున్నానని తిరస్కరించడం వంటి సన్నివేశాలు మనసులో మెదిలాయి. నాకు చూస్తే హైట్కి తగ్గ వెయిట్ లేదు. నరుసు ఆ విషయం చెప్తే నాకు కొత్తేమీ కాదు కానీ కర్మ కాలి హెచ్ ఐ వీ టెస్ట్ చేయించమంటుందేమోనని హడిలి చచ్చాను. ఆ అవమానం భరింపరానిదని తలచి మా అమ్మ నందికేశ్వరుని నోము ఫలాన్ని అక్కడ వాడేసి టిబి టెస్ట్ తో మాత్రమే బయట పడ్డాను.

ఇంట్లో ఉండగా మా చెల్లి సంగీత సాధన ప్రభావం వల్ల కర్ణాటక సాంప్రదాయపు శాస్త్రీయ సంగీతంతో కొంత పరిచయమేర్పడింది. మీకీపాటికి నా ఆలోచనలు తెలిసి ఉండాలి. ఒక పక్క మంగళంపల్లి, మరొక పక్క ఎం.ఎస్.సుబ్బ లక్ష్మి. సాధన దానంతట అదే మొదలైపోయింది. అక్షింతలు కూడా వెన్నంటాయి. ఒరేయ్ నీ దిక్కుమాలిన గార్ధభ స్వరం చాలదన్నట్టు శృతి లయ లేని ఆ గావు కెకలేమిటని మా చెల్లి, డబ్బిచ్చి చెప్పిస్తున్న దాని సంగీతం చెడిపోతుందని మా అమ్మ నా నోరు నొక్కే విఫల యత్నం చేసారు. వీణ్ణి వద్దనడం కన్నా పాటలో తప్పు సవరించడం ఉత్తమమన్న తెలివైన నిర్ణయానికి వచ్చిన మా చెల్లి నా ప్రథమ గురువయ్యింది. సరళీశ్వరాలు, జంటలు, గీతాలు, స్వర పల్లవులు, స్వర జతులు వంటి ఇతరత్రా చిలవలు, పలవలు నాకక్కరలేదని దాన్ని డబాయించి నాకు నచ్చిన వర్ణాల మీద పడ్డాను. చక్కగా ఉన్న దాని సంగీత పుస్తకాలు నా సాధన ధాటికి కొంచం చిరుగు ముఖం పట్టాయి. పట్టు వదలని విక్రమార్కుని వలె నేను చేసే సాధనకి, స్వతహాగా నాలో నిద్రాణమై ఉన్న గానకళా కొవిదుడు లేచి కచేరీ చెయ్యడాన్ని చూసి ముగ్ధురాలైన మా అమ్మ నాకు గురు ముఖతః సంగీతం నేర్పించడానికి ఉపక్రమించింది. అయితే అప్పడికే నేను ప్రజ్వరిల్లిన జిఙ్ఞాస కలిగిన వాడనై చెల్లి నెర్చుకునే వీణని సైతం మీటడం మొదలు పెట్టాను. వైవిధ్యం కోసం స్వరం తెలిసిన తెలుగు, హింది సినిమా పాటలపై ప్రయోగాలు మొదలు. అప్పటికి వయసు ఎక్కువ ఉంది కాబట్టి నా గొంతుని సవరించడం జరగదన్న భావనతో వీణ నేర్చుకోవాలని నిశ్చయించాను. చెల్లినంటే డబాయించగలిగాను కాని సంగీతం టీచర్ దగ్గర ఆ పప్పులు ఉడకలేదు. నెల లొపున పంచరత్నకీర్తనలు వాయించాలని నెను ఉబలాటపడితే పది రోజుల వరకూ సరళీశ్వరాలతోనే గడిచాయి నా వీణ పాఠాలు. నెలలు గడుస్తున్నా నేను అనుకున్న స్థాయికి చేరలేక పోయాను. ఈ పాటికి కీర్తనలకి వస్తాననుకున్న నా ఆశలన్నీ ఇంకా వర్ణాలలోనే ఉండడంతో వివర్ణమయ్యాయి. ఈ జాప్యం దుర్భరమని తలచి, నా అంతట నేనుగా వేరు వాయిజ్యం నేర్చుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఒక మురళి కొన్నాను. ఇంటర్నెట్, పుస్తకాలు, స్నేహితుల సాయంతో నా మురళి వాయిద్యం మొదలు. నక్క ఊళలని, కుక్కలేడుస్తున్నయని వచ్చిన తదితరమైన విమర్శలను లెక్క చేయక సాగింది నా వేణు గానం. వినికిడి కాస్త తక్కువున్నందుకు మీరు చాలా అదృష్టవంతులని తాతగారితో మా నాయనమ్మ నా ప్రత్యక్షంలోనే చెప్పేది. కొత్తల్లో నేను మురళిపై వాయించే పాట నాకు భగవంతుడికి మాత్రమే తెలిసినా కొన్నాళ్ళకు ఇతరులు కూడా గుర్తించ సాగారు. సాధనమున పనులు సమకూరు ధరలోన అని అనుకుంటూన్నంతలో మా చిన్నత్త కొడుకు, (6-7 ఏళ్ళ వయసు వాడికి) వచ్చి నా మురళి తీసుకుని విరిచేశాడు. నేను తప్ప ఇంట్లో అందరూ ఆనందపరవశులై హర్షం ప్రకటించారు. సుఖపడ్డమురా నాయనా అని ఒకరూ, మేము చెయ్యలేని పని నువ్వు చెసావని ఇంకొకరూ వాడిని వేనోళ్ళ కొనియాడారు. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి ఇక మళ్ళీ మురళి కొనడానికి వీలు లేదని ఆంక్షలు విధించారు. నువ్వేమైనా చంటి పిల్లాడివా అని గదమాయించారు. ఈ సందర్భంలో అమ్మ మంగళ గౌరి వ్రత పుణ్యం వాడడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. బలవంతంగా నా స్వయంప్రకాశానికి స్వస్తి చెప్పించారు. నా జాతకంలో శుక్రుడు శతృ స్థానంలో ఉంటే, ఎవరినని ఏమి లాభమని సరిపెట్టుకున్నను.

No comments: